ఈ రోజు నల్లమోతు శ్రీధర్ గా రాష్ట్రంలోని చాలా మందికి సుపరిచితమైన నేను ఎప్పటికీ నా గతం ఇతరులకు వెల్లడించకూడదని అనుకుంటూ వచ్చాను. కాని ఆలోచిస్తుంటే నా గతం తెలుసుకుంటే దాన్ని చదివిన ఒకరిద్దరికైనా ప్రేరణ కలగవచ్చన్న ఆశతో దీన్ని రాయడానికి పూనుకున్నాను. ఇక్కడ నేను రాసిన ప్రతీ అంశం అహంకారం, స్వీయ సానుభూతి, గొప్పలు చెప్పుకోవడం. వంటి మానసిక ప్రలోభాలకు అతీతంగా నా మనసుని స్థిరీకరించుకుని రాస్తున్నదే. కొందరికైనా స్పూర్తిదాయకంగా ఉంటుందని వ్యక్తపరుస్తున్నదే తప్ప ఎవరి సానుభూతినీ నేను ఆశించడం లేదు.
నాకు నాన్న అనబడే వ్యక్తి నేను చిన్నతనంలో ఉండగానే రెండవ పెళ్ళి చేసుకుని మా అమ్మని, ఇద్దరు అక్కలను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. పాపం మా అమ్మమ్మ, తాతయ్యలు అప్పటి నుండి మా కోసం రెక్కలు ముక్కలు చేసుకుని తినీ తినకా మా కోసం శ్రమించనారంభించారు. నాకు ఊహ తెలిసే నాటికి మా నాన్న చేసిన అన్యాయం, చుట్టూ సమాజం యొక్క భరించలేని వేధింపులు తోడై మా అమ్మ మానసిక రోగిగా మారింది. అంత చిత్త చాంచల్యంలో కూడా అమ్మ కనబరిచిన ప్రేమ నిజంగా నా జీవితంలో మర్చిపోలేను. మనసు బాగా వ్యాకుల పడినపుడు అమ్మ ఎక్కడికో తెలియకుండా పలుమార్లు ఇంటి నుండి పారిపోతుంటే వెదికి పట్టుకుని తీసుకువచ్చేవాడిని. మేము పడే బాధని అందరూ ఎంత వినోదంగా చూసేవాళ్ళో ఇప్పటికీ కళ్ళలో మెదులుతూంది. నేను పదవ తరగతి పరీక్షలు రాస్తుండగా అనారోగ్యంతో అమ్మ కాలం చేసింది. డిగ్రీ ఫస్టియర్‍లో ఉండగా తాతయ్య అన్ని ఆర్ధిక, సామాజిక బాధ్యతలను నాకు అప్పజెప్పి చనిపోయారు.
ఒక్కసారిగా ఆర్ధిక స్వేచ్చ వచ్చేసరికి .. ఆర్ధికంగా ఇంకా సంపాదించాలన్న తపన ఉన్నప్పటికీ అనుభవ రాహిత్యం వల్ల ఏ ప్రణాళికా ఫలించక, అంతలో స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ వంటి అలవాట్లు కమ్ముకుని వ్యక్తిగా పతనం అవడం ప్రారంభించాను. చాలా ప్రమాదకరమైన ఫోర్ట్ విన్ ఇంజెక్షన్లని చేయించుకునేవాడిని. రెండు సంవత్సరాల పాటు రోజుకి 30-40 రెస్టిల్ స్లీపింగ్ పిల్స్ వేసుకుని మత్తుగా పడుకునే వాడిని. మనసు నిండా ఇన్ సెక్యూరిటీ. ఎవరి కోసం, ఎందుకోసం బ్రతుకుతున్నానో తెలియని స్థితి. అమ్మమ్మ , తాతయ్యలు ఉన్నంతవరకూ సమాజం నుండి మానసికంగా ఎదురయ్యే వేధింపుల నుండి ఎలాగోలా రక్షణ కల్పించేవారు. వారూ పోయాక అందరూ రాళ్ళేసే వారే అయినప్పుడు… ఆ ఎదుగుతున్న వయసులో అవన్నీ తట్టుకోగలిగినంత మానసిక స్థైర్యం నాకు లేనపుడు డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్, రత్నా కిళ్ళీ వంటి వ్యసనాలే కొద్ది సమయమైనా నాకు ఊరట ఇచ్చేవి.
ఆ బాధ స్థాయి ఏమిటొ తెలియని వారు ఈ రోజు ఇవన్నీ తెలుసుకుని నన్ను అసహ్యించుకోవచ్చు గాక… కానీ తల్లిదండ్రుల వెచ్చటి ఒడిలో బాల్యం గడిపిన వారు ఊహకైనా ఇలాంటి పరిస్థితుల్ని జీర్ణం చేసుకోలేరు. నిజంగా నల్లమోతు శ్రీధర్‍గా నేను ఈ రోజు ఏదైనా సాధించాను , నాకంటూ ఓ గుర్తింపు సాధించగలిగాను అంటే అది పూర్తిగా సమాజం నుండి ఎదుర్కొన్న మనసుని మెలిపెట్టే బాధాకరమైన సవాళ్ళ వల్లనే. మగవాడు ఏడవకూడదని అంటారు.. కానీ నేను జీవితంలో స్థిరపడేటంత వరకూ , సమాజం నా ఒంటరి తనంతో ఆడుకునే వరకూ నేను నా దుస్థితికి ఏడవని సందర్భం లేదు. మూడు నాలుగు సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించాను. కానీ దేవుడు ఎందుకో నన్ను బ్రతికించాడు. ఒకసారైతే… నా ప్రాణాలు నా నుండి దూరం అవుతున్న స్థితిని సైతం అనుభవించి సకాలంలో వైద్య సాయం అందడంతో బ్రతికాను. ఇన్ని అలవాట్లు ఉన్నా నాకు చిన్నప్పటి నుండి ఒక మంచి అలవాటు ఉంది. పుస్తకాలు చదవడం . పానుగంటి డిటెక్టివ్ పుస్తకాలు, యండమూరి ఆనందోబ్రహ్మ వంటి నవలలు ఇదీ .. అదీ అని లేకుండ వందలకొద్దీ నవలలు, ఇతర పుస్తకాలు చదివి ఉంటాను. చివరకు ఇండియన్ పీనల్ కోడ్, లుకేమియా(బ్లడ్ కేన్సర్) , గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంటి ఒకదానితో ఒకటి పొంతన లేని అనేక అంశాలపై కనబడిన పుస్తకం అల్లా కొని చదివేవాడిని.
అమ్మమ్మ చనిపోయిన రెండు మూడు రోజులకు మా కుటుంబానికి సన్నిహితంగా ఉండే పెద్దలు అందరూ నన్ను టార్గెట్ చేసుకుని పంచాయితీ పెట్టారు. ఇలా తయారయ్యావు. జీవితంలో ఇంకా ఏమి పనికొస్తావు అని ఒక్కొక్కరు ఒక్కో రకంగా సూటిగా బాణాలు వదిలారు. నాలో అపారమైన టాలెంట్ ఉండి, నా ఆలోచనలను నేను అంతర్ముఖుడిగా ఉన్నపుడు విశ్లేషించుకోవడం ద్వారా నేను గ్రహించగలుగుతూనే ఉన్నాను. కానీ బయటి పరిస్థితులు, నా అలవాట్లు, ఇప్పటిలా అప్పుడు ఉద్యోగాలు లేకపోవడం వంటి అనేక అంశాలు నాకు ప్రతిబంధకంగా నిలిచేవి. బంధువులు అందరూ మీటింగ్ పెట్టిన రోజు ఎంత బాధపడ్డానో నాకే తెలియదు. మరుసటి రోజు యధావిధిగా నా జేబులో ఉన్న స్లీపింగ్ పిల్స్ మూడు ఫుల్ స్త్రిప్‍లను వేసుకుందామని జేబులో నుండి తీశా….ఎందుకో మనసు వప్పలేదు. అవి లేకపోతే నేను బ్రతకలేను అన్నంత కోరిక కలిగితే రేపు వేసుకుందాం, ఈ రోజుకి మాత్రం మానేద్దాం అని మళ్ళీ వాటిని జేబులోకి తోసేశాను. అదే నా జీవితంలో పెద్ద మలుపు. అంత భయంకరమైన వ్యసనం నుండి ఆ ఒక్కరోజుతో విముక్తి పొందాను. స్మోకింగ్, అప్పుడప్పుడు డ్రింకింగ్ అప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అప్పుడు నా మనసు నిండా ఆవరించుకున్నది…. నా ఊరు, నా ఊరి జనాల మనస్థత్వం. ఎలాగైనా నేనేంటో నిరూపించుకుని నా ఊరి ప్రజలకు నా విలువ తెలియజెప్పాలన్నది నా ప్రగాఢ వాంచ !
సివిల్ సర్వీసెస్ కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయ్యాను. కాని వివిధ కరణాల వల్ల ముందుకు వెళ్ళలేకపోయాను. డిగ్రీ సెకండియర్‍లో ఉండగా ఐసిడబ్ల్యుఎ ఫౌండేషన్ రాసి, విజయవాడ మోడరన్ అకాడమీ, సూపర్‍విజ్‍ల ద్వారా ఐసిడబ్ల్యుఎ ఇంటర్ పూర్తి చేశాను. అప్పట్లో ఖాళీ సమయాల్లో వ్యాసాలు రాసి సూపర్‍హిట్ సినిమా మేగజైన్ వారు నడుపుతున్న క్రేజీవరల్డ్ అనే పత్రికకు పంఫేవాడిని. ప్రేమలో పావనీ కళ్యాణ్, చంటిగాడు, గుండమ్మగారి మనవడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జయా మేడమ్ ఆ పత్రికలను నడిపేవారు. ఒకరోజు నాకు ఒక లెటర్ వచ్చింది. తమ సంస్థలో సబ్ ఎడిటర్ పోస్ట్ ఖాళీగా ఉందని, మద్రాస్‍లో పనిచేయవలసి ఉంటుందని, ఆసక్తి ఉంటే వెంటనే వచ్చి కలవండని జయా మేడమ్ స్వయంగా లెటర్ రాశారు. మద్రాస్ వెళ్ళి ఒక ప్రక్క ఐసిడబ్ల్యుఎ ఫైనల్ చేస్తూ జాబ్ చేయవచ్చన్న ఉద్ధేశంతో మద్రాస్ వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక .. ఒక్క కేజీవరల్డ్ కే కాకుండా సూపర్‍హిట్‍కి జయా మేడమ్ నన్ను సబ్‍ఎడిటర్‍గా అపాయింట్ చేశారు. క్రేజీవరల్డ్ మొత్తం నేనే ఆర్టికల్స్ రాయడం, కంప్యూటర్‍లో కంపోజ్ చేయడం, డిజైన్ చేయడం.. మరోవైపు సూపర్‍హిట్ కోసం ఊటీ, కేరళ,వైజాగ్ వంటి ఔట్‍డోర్ షూటింగులకు వెళ్ళి చిరంజీవి, బాలకృష్ణ వంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేసుకురావడం.. దీనితోనే సరిపోయేది. ఇక ఐసిడబ్ల్యుఎ చదువు అటకెక్కింది.
తెలుగులొ మొట్టమొదటిసారిగా క్రేజీవరల్డ్ పత్రికతో పాటు కంప్యూటర్ల మీద ఒక అనుబంధం అందిద్దామని జయా మేడమ్ ప్రపోజ్ చేయడం .. ఏమి రాయాలో ఎలా రాయాలో అసలు టెక్నికల్ విషయాలను తెలుగులో అంతవరకూ ఎవరూ రాసి ఉండకపోవడంవల్ల నేనే నా స్వంత ఒరవడిని ప్రారంభించాను. ఆ తర్వాత కొద్ది నెలలకు కంప్యూటర్ విజ్ఞానం ప్రారంభమైంది. ఓ ప్రక్క నేను క్రేజీవరల్డ్‍లో రాస్తూ.. ఆ తర్వాత అక్కడ మానేసి హైదరాబాదు వచ్చేసి “కంప్యూటర్ వరల్డ్” అనే పత్రికను రాయడం, కంపోజ్ చేయడం వంటివన్నీ ఏక వ్యక్తిగా నిర్వహించాను. రాయడంలో నేను చిత్తశుద్ధిగా ఉన్నా దాని యాజమాన్యం సకాలంలో పత్రికను తీసుకురాక విసిగించడం వల్ల గుడ్‍బై చెప్పాను. ఆ పత్రిక మూతపడింది. అప్పుడు విజేత కాంపిటీషన్స్ సాయిబాబుగారు “మనం ప్రారంభిద్దాం సార్” అంటు ప్రతిపాదించారు. సరే అని తిరిగి అన్ని బాధ్యతలూ నా నెత్తిన వేసుకున్నాను. అలా 2001 అక్టోబర్‍లో ప్రారంభం అయినదే “కంప్యూటర్ ఎరా” .
ఈ పత్రికను ఎంతో ధీక్షగా ఒక రుషిలా తీర్చిదిద్దుతూ వచ్చాను. పాఠకులకు నాకు చేతనైనంత వరకు సేవ చేద్దామన్న ఉద్ధేశంతో రోజుకు సగటున 60 ఫోన్ కాల్స్ వరకూ పాఠకుల డౌట్స్ ని క్లారిఫై చేయడానికి వెచ్చించాను. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడు ఫోన్ మోగినా ఓపిగ్గా చెప్పేవాడిని బాగా అలిసిపోయిన సందర్భాల్లొ తర్వాత చేయండని చెప్పినా అవతలి వారు వాదనకు దిగినపుడూ సహనం కోల్పోయి విసుక్కున్న ఘటనలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. నా ఊరి ప్రజలకు నా విలువ తెలియజేయాలి అన్న కసితో ప్రారంభించిన నా కెరీర్‍ని కొద్దిరోజుల్లోనే ఎక్కడో బావిలో కప్పల్లా బ్రతికే వారికి నా గొప్పతనం ఎప్పటికి తెలియాలి అన్న వాస్తవాన్ని గ్రహించి … ఆ ప్రతీకారాన్ని వదిలేసి.. పూర్తిగా ఈ సమాజానికి నాకు చేతనైంది ఎంటో కొంత చనిపోయేలోపు చేసి వెళదాం అన్న తపనతో పనిచేయడం ప్రారంభించాను. కంప్యూటరే నా ప్రపంచం. ఎంత పరిశోధన చేశానో , రేయింబవళ్ళు ఎంత మమేకమై పోయానో ఎవరూ ఊహించలేరు. నా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, దానిని పదిమందికీ పత్రిక ద్వారా, ఫోన్ ద్వారా, మెయిల్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా, ఫోరమ్, కొత్తగా బ్లాగు ద్వారా వెచ్చిస్తున్న సమయాన్ని ఒక ఆరు నెలలపాటు ఎదో ఒక హాట్ కంప్యూటర్ కోర్స్ ని చేయడానికి వెచ్చించి ఉన్నట్లయితే.. 1996 లో నా కంప్యూటర్ కెరీర్‍ని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికి ఆర్ధికంగానూ, కెరీర్ పరంగానూ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయేవాడిని.
ఈ రోజు కూడా మైక్రోసాఫ్ట్, ఇన్‍ఫోసిస్‍లలొ పనిచేసే ఉద్యోగులకు ఇచ్చినంత విలువ నా బంధువులు గానీ , సమాజం గానీ ఇవ్వకపోవడం చూస్తుంటే బాధ కలగదు. నవ్వు వస్తుంది ! కాని వారందరు గొప్పగా చెప్పే ఆయా సంస్థల ఉద్యోగుల కన్నా నేను చాలా చాలా ఐశ్వర్యవంతుడనని సంతోషిస్తుంటాను. నాకు వచ్చేది పదివేల రూపాయల జీతమే ఐనా నేను నాకు చేతనైంది ఎంతో సమాజానికి చేస్తున్నాను అనే తృప్తి చాలు. కేవలం కంప్యూటర్ ఎరా చదివి ఓ 70 ఏళ్ళ వ్యక్తి కంప్యూటర్ ఆపరేట్ చేయడం నేర్చుకున్నాడంటే…నేను అందించిన విజ్ఞానం ఈ రోజు ఎందరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా అవే పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడింది అంటే అంతకన్నా కావలసింది ఏముంది. మా అమ్మమ్మ , తాతయ్యలు కష్టపడి సంపాదించి ఇచ్చిన కొద్దో గొప్పో ఆస్థి ఉంది. డబ్బు ముఖ్యం కాదు. మొదట్లో సమాజం నన్ను గుర్తించాలని అనుకున్నాను .. కాని ఈ రోజు నాకు అర్ధమైంది సమాజం నన్ను ఒక్కడిగా గుర్తించదని.. నాతోపాటు డబ్బు ఉంటేనే నాకు విలువ ఉంటుందని ! అందుకే మా ఊరు, సమాజం గుర్తించాలన్న స్వార్ధాన్ని వదిలేసాను. నా పని నేను చేసుకుంటు వెళ్లిపోతున్నాను. నా నాలెడ్జ్ ని పెంచుకోవడం, దాన్ని పదిమందికి పంచడం ఇదే నా వ్యాపకంగా మార్చుకున్నాను.… దురదృష్టవశాత్తు చాలా మంది కంప్యూటర్ ఎరా మేగజైన్‍ని ఇటీవలే చూస్తున్నారు. వీలైతే ఒక్కసారి పాత సంచికలన్నీ మా పత్రికాఫీసునుండి పొంది ఒక్కో పేజీ తడిమి చూడండి.. నా చెమట వాసన తప్పకుండా మీరు గుర్తించగలుగుతారు. ఎంత నాలెడ్జి గత సంచికల్లో గతంలోకి వెళ్ళిపోయిందో ఈ రోజు మీకు తెలియకుండా పోయిందో అర్ధమవుతుంది.ఒక ప్రక్క అనారోగ్యంతో పోరాడుతూనే పత్రికను పూర్తిచేయగలిగేవాడిని పాఠకుల అభిమానమనే ధైర్యంతో. ఒకసారైతే తీవ్ర అనారోగ్యంతో రెండు నెలలు పత్రిక అస్సలు రాయలేకపోయాను. ఐనా పాఠకులు, పత్రికాధినేతలు నా కోసం ఎదురుచూశారు.
రెండు సంవత్సరాల క్రితం వరకూ స్మోకింగ్, డ్రింకింగ్ రెండూ కొనసాగాయి. వాటినీ ఈ రోజు నుండి మానేస్తాను అనే “ఒక్కరోజు నిర్ణయం” తో మానేశాను. ఇప్పుడు రోజుకి మూడూ గంటల పాటు యోగాకి వెచ్చించడం, రోజుకి 6 లీటర్ల నీళ్ళు తాగడం (బీర్లు మానేసి) రా ఫుడ్ తినడం వంటి చాలా మంచి అలవాట్లు చేసుకున్నాను. చూడండి .. అప్పటికీ , ఇప్పటికీ ఏమైనా పోలిక ఉందేమో? అదే జీవితం అంటే అనిపిస్తుంది నాకు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఇదంతా రాయడం వెనుక అసలు ఉద్ధేశం ..
22 సంవత్సరాల వయసులో జీరోగా ఉండి అందరితో నానా మాటలు పడి చావాలని నిర్ణయించుకున్న వ్యక్తి తన సంకల్పబలంతో , సమాజంమీద కసితో , చెడు అలవాట్ల మూలంగా పాడైన ఆరోగ్యంతో పోరాడుతూ, 32 సంవత్సరాల వయసులో తనకంటు ఒక స్థానాన్ని నిలుపుకుని, ఇన్నిమలుపులు,ఒడిదుడుకులు, కష్టాలు, విజయాలు, వైఫల్యాలు చవి చూసిన శ్రీధర్ ఇప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో (యాంగ్జైటీ న్యూరోసిస్ వంటి కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నా) పనిచేస్తుంటే, అన్నీ చక్కగా ఉండి తల్లితండ్రుల ప్రేమ, ప్రోత్సాహం,రక్షణ, చక్కని ఉద్యోగాలు, ఆదాయాలు ఉన్నవారు ఎందుకు సమాజం పట్ల కొద్దిపాటైనా బాధ్యతని వహించలేకపోతున్నారు అన్నది బాధ కలిగింఛే అంశం.
ఈ సమాజం మనది మనకోసం మనం కూడబెట్టుకునేది ఏదీ శాశ్వతంగా ఉండదు. మనం ఇతరులకు
పంచి ఇచ్చేదే అది ప్రేమ కానీండి.. విజ్ఞానం కానీండి. అదే మనం రేపు చనిపోయినా మిగిలి ఉంటుంది. అలాంటి కొద్దిపాటి ప్రయత్నాలనైనా సమాజం పట్ల బాధ్యతగా ప్రతీ ఒక్కరూ చేయాలన్న ఒకే ఆకాంక్షతో ఏ ఒక్కరికైనా ఇది స్పూర్తిదాయకంగా ఉంటుంది అనే ఆలోచనతో శ్రీధర్ నాకు చెప్పిన విషయాలను అతని అనుమతితో మీ అందరితో పంచుకుంటున్నాను. ఇది చదివి అతని మీద జాలి పడకండి. ప్లీజ్….